హార్మోన్ల అసమతుల్యతతో పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ (పిసిఒడి).

Suka Samsaram
0
ఇటీవలి కాలంలో 20 నుంచి 40 సంవత్సరాలలోపు వయస్సున్న మహిళల్లో 5 నుంచి 10 శాతం మందిని ఈ వ్యాధి బాధిస్తుంటుంది.  మహిళల్లో నెలసరిలో అపక్రమం, అకార ణంగా బరువు పెరగడం, మొటిమలు, అవాం ఛిత రోమాలు, మధుమేహం వంటివి కలిసిక ట్టుగా కనిపిస్తుంటే ముందుగా ఈ వ్యాధి గురించి ఆలోచించాలి. సంతాన రాహిత్యానికి ఈ వ్యాధి ఒక ముఖ్యమైన కారణం.

మహిళల్లో తరచుగా కనిపిస్తున్న వ్యాధి పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ (పిసిఒడి). అనేక రకాలైన వ్యాధి లక్షణాలను కలిగి ఉండటం వలన దీనిని సిండ్రోమ్ అని వ్యవహరిస్తున్నారు. ఇది హార్మోన్ల అసమతుల్యత వలన వస్తుంది. అండాల విడుదల మీద ప్రభావాన్ని చూపుతుంది. దీని పర్యవసానంగా ఇతర శారీరక వ్యవస్థల మీద కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ వ్యాధితో బాధపడే మహిళల్లో చాలా మందికి ఇలాంటి వ్యాధి తమకున్నదనే సంగతి తెలియదు. తాము తమ ప్రమేయం లేకుండా బరువెందుకు పెరుగుతున్నారో, ఉన్నట్లుండి తమ శరీరంపై అవాంఛిత రోమాలు ఎందుకు పెరుగుతున్నాయో తెలియక ఆందోళన చెందు తుంటారు. ఈ సమస్యల పరిష్కారం ఎన్ని  ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం కనిపించదు.

లక్షణాలు
సంవత్సరానికి ఎనిమిది సార్లకంటే తక్కువగా బహిష్టులు రావటం. లేదా అసలు బహిష్టులే కనిపించకపోవడం. లేదా బహిష్టు స్రావం క్రమరహితంగా ఉండటం అనేది ఈ వ్యాధిలో ప్రధాన లక్షణం.
ఈ వ్యాధిలో కనిపించే మరొక ముఖ్య లక్షణం ఉన్నట్లుండి రోమాలు పెరగడం. ముఖం, ఛాతి, పొట్ట, వీపు, చేతులు, కాళ్ల మీద అవాంఛిత రోమాలు కనిపిస్తాయి. చర్మ సంబంధమైన సమ స్యలు -ముఖ్యంగా మొటిమలు, జిడ్డు చర్మం, చుండ్రు, ముదురు రంగు మచ్చలు, చర్మ కీలలు (స్కిన్ట్యాగ్స్) వంటివి ఇబ్బంది పెడతాయి.
హార్మోన్ సమస్యల వలన కాని, అవాంఛిత రోమాల వంటి సమస్యల వలన కాని డిప్రెషన్, అసహనం వంటి భావోద్వేగాలకు లోనవుతారు. నడుము, తుంటి భాగాలలో నిరంతరమూ నొప్పిగా అనిపిస్తుంది. బరువు పెరుగుతారు. తొడలలో కాకుండా, ఉదర భాగంలో ఎక్కువగా కొవ్వు చేరుతుంది. యుక్త వయస్సులోనే మధుమేహం ప్రాప్తించడం దీనిలో మరో లక్షణం. హార్మోన్ల తేడా వలన ఇలా జరుగుతుంది. స్థూల కాయం వంటి సమస్యల కారణంగా రక్తపోటు పెరుగుతుంది. దీని ఫలితంగా కళ్లు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. మగవారిలో మాదిరిగా బట్టతల లాగా నుదుటి మీది నుంచి వెంట్రుకలు రాలడం కూడా దీనిలో కనిపించే మరో ప్రధాన లక్షణం. ఈ సమస్యలన్నింటి కారణంగా సంతాన రాహిత్యం చోటు చేసుకుంటుంది.
కారణాలు
ఈ వ్యాధి కలుగడానికి జన్యుపరమైన కారణాలు కూడా ప్రధానమైనవి. మామూలు సందర్భాలలో, ఆరోగ్యవంతుల్లో, అండాశయాల పని తీరులో భాగంగా సిస్టులు (నీటి తిత్తి) తయారవుతుంటాయి. బహిష్టు తరువాత ఇవి తగ్గిపోతుంటాయి. అయితే, పిసిఒడిలో ఒకేసారి అనేక సిస్టులు తయారై తగ్గకుండా అలాగే ఉండిపోతాయి. అంతేకాకుండా, అండాశయాల సైజు కూడా పెరిగిపోతుంది. ఫలితంగా హార్మోన్ల తయారీలో లోపం సంభవించి మామూలుగా జరగాల్సిన అండోత్సర్గం (ఓవ్యులేషన్)కు అంతరాయం ఏర్పడి క్రమంగా ఈ వ్యాధిగా పరిణమిస్తుంది.దీనివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి లోనూ, జీవక్రియలలోనూ పెనుమార్పులు సంభవిస్తాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top