మానవజీవితంలో వేగం ప్రవేశించిన దగ్గర్నుంచి రకరకాల మానసిక ఒత్తిడులు మనిషిని కుంగదీయడం మొదలైంది. ఇంటా- బయటా ఎన్నో సమస్యలు వుంటున్నాయి. ఈ రకంగా తలెత్తే మానసిక ఒత్తిడి సెక్స్ మీద కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. సెక్స్‌లో ఆసక్తి తగ్గిపోవడం, సమర్థవంతంగా పాల్గొనలేకపోవడం, సెక్స్‌లో పాల్గొన్నా పూర్తి తృప్తి పొందలేకపోవడం జరుగుతుంది.మానసిక ఒత్తిడిని పెంచే ఉద్యోగాలు, వ్యాపారాలు
ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ఇంటి కార్యక్రమాల్లో నిత్యం సతమతమయ్యేవాళ్ళు కొత్తగా పెళ్ళయి అనుభవించవలసిన సెక్స్ సుఖాన్ని అనుభవించలేకపోతున్నారు. దానికి కారణం అనుక్షణం వారి మనసుల్లో ఉద్యోగం గురించో, వ్యాపారం గురించో, మరొక దాని గురించో ఆలోచన, ఆందోళన ఎక్కువ చోటు చేసుకోవడమే. మానసిక ఒత్తిడికి లోనుకావడమే.
మానసిక ఒత్తిడికిలోనైన వ్యక్తులు ప్రతిచిన్న విషయానికి ఊరికనే కంగారుపడుతుంటారు. కొందరిలో ఈ ఒత్తిడివలన భయం, ఆందోళన కలుగుతాయి. గుండెవేగంగా కొట్టుకుంటుంది. రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టడం వుండదు. విపరీతమైన ఆలోచనలు వస్తుంటాయి.
మానసిక ఒత్తిడిలో కనబడే వింత ప్రవర్తన
- మానసిక ఒత్తిడికి లోనైనవాళ్ళు ఇతరులతో ఫ్రీగా మాట్లాడలేరు. అంతకుముందువరకు అందరితో ఎంతో చనువుగా,హుషారుగా వుండేవ్యక్తి ముభావంగా మారతాడు. పైగా వారిలో ఒక విధమైన న్యూనతాభావం, పోస్టుపోన్‌మెంట్ మెంటాలిటీ డెవలప్ అవుతుంది. కొద్దిసేపు పనిచేస్తేనే చాలు బాగా అలసటకు గురవుతారు.
- మానసిక ఒత్తిడనేది కేవలం పురుషులలోనే కాదు, స్త్రీలలోనూ కనబడుతుంది. మానసిక ఒత్తిడికి లోనైన గృహిణి చిన్న విషయానికే పిల్లల్ని కొట్టడం, విసుక్కోవడం, భర్తపై చిర్రుబుర్రులాడటం, ఇంటివాళ్ళతో, పక్కింటివాళ్ళతో గొడవలు పడటం వుంటుంది. అంతేగాక వారిలో తరచూ అలసట, చిన్నదానికే కంగారు, ఎప్పుడూ తలనొప్పి కనబడతాయి.
- ఈ విషయం తెలియక చాలామంది మానసిక ఒత్తిడివల్ల కలిగే బాధలని శారీరక అనారోగ్యంగా భావించి ఏవేవో మందులు వాడుతూంటారు. వారు మానసిక ఒత్తిడి తొల గించుకుంటే ఆ బాధలు ఏ మందుల ప్రమేయం లేకుండా తొలగిపోతాయి.
- మానసిక ఒత్తిడిని మొదటిలోనే గుర్తించి అధిగమించాలి. మానసిక ఒత్తిడి ఎందువల్ల కలుగుతుందో, దాని ప్రభావం మనిషి ప్రవర్తనమీద ఎలా వుంటుందో అర్థం చేసుకుంటే మొదట్లోనే దానిని సరిదిద్దుకోవచ్చు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పనులు చేయవలసివచ్చినా మనస్సును ప్రశాంతంగా వుంచుకోవచ్చు.
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ఎలా?
మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురైన వ్యక్తి రిలాక్సేషన్ టెక్నిక్ సైకలాజికల్ కౌన్సిలింగ్, సైకోథెరపీ, హిప్నోథెరపీ ద్వారా దానిని అధిగమించవచ్చు. ట్రాంక్విలైజర్స్ కూడా మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, మనిషికి రిలీఫ్ ఇవ్వడానికి తోడ్పడతాయి.