తొలి కలయికల్లోని వైఫల్యాలకు కారణాలు....

Suka Samsaram
0
రజనికి పెళ్లై నాలుగు వారాలైంది. ఇంతవరకు ఆమెలో అంగప్రవేశం జరగలేదు.  సంయోగం కోసం భర్త ప్రయత్నించినప్పుడల్లా బాధ కలుగుతోందని గోలపెట్టడంతో ప్రతిసారీ మొదట్లోనే విరమించుకోవడం జరుగుతోంది. ఒక్క సెక్స్‌ విషయంలో తప్ప తక్కిన సందర్భాల్లో అతనంటే ఆమెకు ఎంతో ప్రేమ. అతనికి అన్నీ చేసి పెడుతుంది. సినిమాలకి, షికార్లకి చెట్టపట్టాలేసుకుని హుషారుగా వెళుతుంది. తీరా బెడ్‌ మీదకి చేరిన తరువాత భర్త ఆమె పైకి రాగానే 'అమ్మో వద్దూ...' అంటూ తోసివేస్తుంది. భర్త అంటే అంత ప్రేమగా ఉండే ఆ రజనీయేనా అన్నంత అనుమానం కలుగుతుంది. భర్తకి ఆమె మనస్తత్వం అంతుపట్టకుండా అయింది. అందుకనే ఓ రోజున రజనీని తీసుకుని భర్త ఆసుపత్రికి వచ్చాడు. గడిచిన నాలుగు వారాల విషయాన్ని వివరించాడు.   


''డాక్టర్‌ నాకు తెలియక అడుగుతున్నాను, ఆమె కన్నెపొర దళసరిగా ఉండి సంయోగం కుదరకుండా అవుతోందా? అందువల్లే ఆమెకు నొప్పి కలుగుతోందా?' అని చాలా అమాయకంగా అడిగాడు.
అతని అనుమానం ఎంతవరకు నిజమో అని రజనీని పరీక్ష చేస్తే కన్నెపొర ఏ మాత్రం దళసరిగా లేదు. పైగా కన్నెపొర చిరిగే ఉంది. ఈ నాలుగు వారాలు సెక్స్‌కి ప్రయత్నించడంలో ఎప్పుడో చిరిగిపోయింది.

దళసరైన కన్నెపొర చాలా అరుదు
చాలామందిలో మొదటి కలయిక జరగకపోవడానికి కన్నెపొర దళసరిగా ఉండటం కారణమనే అపోహ ఉంది. కాని ఎక్కడో ఎవరికో తప్ప కన్నెపొర దళసరిగా ఉండటం జరగదు. కన్నెపొర సెక్స్‌కి అడ్డుకోవడమనేది చాలా అరుదు. ఇంజక్షన్‌ అంటే భయంతో ఎంతోమంది బిగుసుకుంటారు. అలాగే ఎందరో స్త్రీలల్లో అంగ ప్రవేశం బాధ కలిగిస్తుందనే భయం అంతర్లీనంగా ఉంటుంది. తాము ఏ కాస్తనొప్పినైనా తట్టుకోలేమని అనుకొంటారు. మనసులో సెక్స్‌ కావాలనే ఆరాటం ఉన్నా అసలు సమయానికి భయం కలిగి బిగుసుకుపోవడం జరుగుతుంది.
భర్త అంగప్రవేశం కొరకు ప్రయత్నిస్తున్న కొద్దీ యోని దగ్గర కండరాలు మరింత బిగుసుకుంటాయి. ఇటువంటి పరిస్థితిని వజినిస్‌మస్‌ అంటారు. ఇది కేవలం భయం వల్ల కలిగేదే తప్ప శారీరకంగా అక్కడ మొదట్నుంచి ఏదో అవరోధం ఉండటం కాదు.
సాధారణంగా సెక్స్‌పరంగా ప్రేరణ పొందితే యోని దగ్గర ద్రవాలు ఊరతాయి.అంతే కాకుండా సెక్స్‌ పరంగా ప్రేరణ పొందినప్పుడు యోని దగ్గర కండరాలు బిగుతు సడలుతాయి. దాంతో అంగప్రవేశం సులువుగా జరిగిపోతుంది. మనసులో సిగ్గు, జంకు, భయం లేనప్పుడు భర్త చేసే ఫోర్‌ప్లేతో కామప్రేరణ చక్కగా కలుగుతుంది. దాంతో అంగప్రవేశం ఎటువంటి బాధలేకుండా జరుగుతుంది. చక్కని తృప్తిని, హ యిని కలిగిస్తుంది. ఒకవేళ మొదటి కలయిక కొంత నొప్పి అనిపించినా రెండవ కలయిక ఎటువంటి బాధా ఉండదు.

సహకారం- సంయోగం
మొదటి కలయిక తృప్తికరంగా జరగాలంటే భార్య సహకారం చాలా అవసరం. మనసులు ఒకటై కౌగిలింతలతో మైమరిచి మత్తుగా మారితే అంతా సుఖప్రదంగా జరిగిపోతుంది. కొందరు స్త్రీలలో పెళ్లై ఎంతకాలమైనా సంయోగమే జరగదు. దానికి కారణం భార్య సరిగ్గా సహకరించకపోవడమే. ఒకవేళ సహకరించినట్లు అనిపించినా ఆమెలో సెక్స్‌పరంగా స్పందన కలగకపోవడమే.
సెక్స్‌ పరంగా స్త్రీ స్పందించనప్పుడు యోని డ్రైగానే ఉంటుంది. యోని డ్రైగా ఉన్నప్పుడు అంగం పూర్తిగా లోని ప్రవేశించదు. ఒకవేళ అంగప్రవేశం జరిగినా యోని లోపల పొడిగా ఉండటంతో మంట అనిపిస్తుంది. దాంతో ఆమె సెక్స్‌కి సహకరించకుండా అవుతుంది.

సెక్స్‌ కావాలనే ఉంటుంది అయినా జరగని సెక్స్‌
కొందరు స్త్రీలల్లో సెక్స్‌ కోరిక చక్కగా ఉంటుంది. సెక్స్‌లో తృప్తి పొందాలనే ఆరాటమూ ఉంటుంది. అయినా సంయోగం కుదరనే కుదరదు. ఎంత ఫోర్స్‌ చేసినా అంగప్రవేశం జరగనే జరగదు. విచిత్రం ఏమిటంటే ఇటువంటి స్త్రీలలో సెక్స్‌ అంటే ఇష్టమే. కాని వారికి తెలియకుండా అంతర్లీనంగా మనసులో పది రెట్లు సెక్స్‌ అంటే భయం ఉంటుంది.
సాధారణంగా బాల్యంలో, కౌమారంలో వాళ్ళకి తెలియకుండానే సెక్స్‌ గురించి భయం కలుగుతుంది. సెక్స్‌ గురించి భయం కలిగిన విషయాన్ని మరిచిపోయినా అంతర్లీనంగా మనసు పొరల్లో ఆ భయం చోటు చేసుకుంటుంది. అలా వారిలో భయం ఉందన్న విషయం వారికే తెలియదు. 

సెన్సిటివ్‌గా ఉన్న స్త్రీలలో మొదటి కలయికలు
'టచ్‌ మీ నాట్‌' మొక్క ఆకులు చేతులు తగిలితే చాలా ముడుచుకుపోతాయి. అలాగే 'టచ్‌ మీ నాట్‌' స్త్రీలు కూడా ఉంటారు. వీరి మనసు ఎంత సెన్సిటివ్‌గా వుంటుందో యోని దగ్గర కండరాలు అంతకన్నా సెన్సిటివ్‌గా వుంటాయి. అందుకనే ఇటువంటి స్త్రీలల్లో పురుషాంగం టచ్‌ కాగానే యోని ద్వారం దగ్గర కండరాలు బిగుసుకుపోతాయి. దాంతో యోని ద్వారం అతి చిన్నదై పోతుంది.
యోని దగ్గర నరాలు అంత సెన్సిటివ్‌గా మారడానికి మనసులో తెలియని భయం ఉండటమే కారణం. దీనినే సైకో న్యూరోటిక్‌ కండిషన్‌ అంటారు. అలా ఉన్నప్పుడు వారు న్యూరోటిక్‌గా మారతారు. ఈ న్యూరోసిస్‌ అనేది అన్ని సందర్భాలలోనూ, అన్ని విషయాల్లోనూ కాకుండా ప్రత్యేక సమయంలో, ప్రత్యేక విషయంలో ఉండవచ్చు. తక్కిన వాటన్నింటిలో వాళ్ళు ఎంతో మొండిగా, ధైర్యంగా ఉండవచ్చు. ఇటువంటి స్త్రీలలోనే వజినిస్‌మస్‌ ఉంటుంది.
వజినిస్‌మస్‌ రెండు రకాలు
1.ప్రైమరీ వజినిస్‌మస్‌
2.సెకండరీ వజినిస్‌మస్‌ ప్రైమరీ వజినిస్‌మస్‌ అనేది కేవలం మానసికమైనదే. సెకండరీ వజినిస్‌మస్‌ అనేది యోని దగ్గర గాయమో, గడ్డో మరొకటో ఉండటం వల్ల కలుగుతుంది.
సంయోగం ఎంతకీ కుదరనప్పుడు యోని దగ్గర పరీక్ష చేసి సెకండరీ వజినిస్‌మస్‌ పరిస్థితి ఏదైనా ఉందేమో నిర్ధారణ చేసుకోవాలి. అటువంటి పరిస్థితి ఉంటే దానికి తగిన చికిత్స చేస్తే కొద్ది రోజుల్లో పరిస్థితి చక్కబడి సంయోగం సంతృప్తిగా జరిగిపోతుంది.

మొదట్లో ఆల్‌రైట్‌ తరువాతనే డిఫ్‌కల్టీ!
కొందరు స్త్రీలలో మొదటి కలయికలు చక్కగా జరిగి కొద్దిరోజుల తరువాత కుదురకుండా అవుతుంది. భర్త ఎంత ప్రయత్నించినా అంగప్రవేశం జరగదు. పైగా బాధ కలుగుతుంది. ఇటువంటి పరిస్థితిని సెకండరీ వజినిస్‌మస్‌ అనవచ్చు. మొదటి కలయికలో యోని బిగుసుకుపోయి వాయవచ్చు. లేదా యోని లోపల చీరుకుపోవచ్చు. దాని వల్ల తెలియని నొప్పి కలిగి అంగప్రవేశం జరపబోయే సమయానికి యోని కండరాలు బిగుసుకుపోవచ్చు.
సెకండరీ వజినిస్‌మస్‌ పరిస్థితి కొంతకాలం కాపురం చేసిన తరువాత, కాన్పుల తరువాత, యోని దగ్గర ఆపరేషన్‌ అయిన తరువాత, లైంగిక వ్యాధులు వచ్చినప్పుడు ఎదురవవచ్చు. మూలకారణాన్ని తెలుసుకుని చికిత్స చేస్తే సంయోగం సుఖవంతంగా జరుగుతుంది.
కొందరిలో సెకండరీ వజినిస్‌మస్‌కి చికిత్స చేసి పరిస్థితిని చక్కదిద్దినా సంయోగం సమయంలో యోని ద్వారం కండరాలు బిగుసుకుపోవడం, అంగప్రవేశం జరగకపోవడం ఉంటుంది. ఇటువంటి వారిలో మూలకారణాన్ని చక్కదిద్దినా వారి మనసులో చోటుచేసుకున్న భయం తొలగకపోవటమే కారణం. అందుకని వజినిస్‌మస్‌ పరిస్థితి ఉన్నవారి మానసిక పరిస్థితిని పరిశీలించాలి.

సెక్స్‌ అంటే నీచమనే భావం కూడా వజినిస్‌మస్‌కి కారణం
ప్రైమరి వజినిస్‌మస్‌కి స్త్రీలల్లో ఉండే కొన్ని భావాలు కూడా కారణం. ఒకవైపు మనసులో సెక్స్‌ కోరిక ఉన్నా మరొకవైపు మనసులో లైంగిక కార్యం నీచమనే భావం బలంగా చోటు చేసుకున్నట్లైతే సెక్స్‌ జరగనీయకుండా యోని ద్వారం దగ్గర అకస్మాత్తుగా కండరాలు బిగదీసు కుంటాయి.
సెక్స్‌ గురించి సరైన అవగాహన కలిగిస్తే వజినిస్‌మస్‌ చాలావరకు తొలగిపోవచ్చు. కొందరిలో మనసులో చోటు చేసుకున్న భయం, జంకు, ఆందోళన తొలగడానికి సైకోథెరపి అవసరం అవుతుంది.
వజినిస్‌మస్‌ ఉన్న చాలామంది స్త్రీలల్లో తమ యోని రంధ్రం చాలా చిన్నదనే భావం పాతుకుపోయి ఉంటుంది. అందుకనే తమలో అంగ ప్రవేశం కుదరటం లేదని అనుకుంటారు. వజినిస్‌మస్‌ ఉన్నప్పుడు ఆ స్త్రీకి గైనిక్‌ చెకప్‌ అయినటువంటి పి.వి. కూడా చేయటంకుదరదు. డాక్టర్‌ తన వ్రేళ్ళని యోని మార్గంలోకి చొప్పించి పరీక్ష చేయలేకపోతారు. దానికి కారణం పి.వి. కోసం కూడా వ్రేళ్ళు యోనిలోకి వెళ్ళవనే అభిప్రాయం గట్టిగా ఉండటమే. ఒకవేళ డాక్టర్‌ పరీక్ష చేస్తే తమ యోని రంధ్రం చిన్నది కాబట్టి చాలా బాధ కలుగుతుందనే భయం వారిలో ఉంటుంది. అందువల్ల డాక్టర్‌ పి.వి. చేయాలన్నా, యోని రంధ్రం దగ్గరకండరాలు బిగుసుకుపోవడం వల్ల కుదరకుండా అవుతుంది.

వజినిస్‌మస్‌కి చికిత్స
వజినిస్‌మస్‌ పరిస్థితి కొందరిలో చాలా జటిలంగా ఉంటుంది. ఇటువంటి వారికి పూర్తి మత్తు ఇచ్చి యోనిలో వెడల్పాటి డైలేటార్‌ ప్రవేశపెట్టి తెలివి వచ్చిన తర్వాత వారికి చూపించి అంగప్రవేశానికి యోని మార్గం ఏ మాత్రం సన్నది, చిన్నది కాదని తెలియచేయవలసి వస్తుంది. ఆ తరువాత సైజుల వారి డైలేటార్స్‌ ఇచ్చి వారి మటుకు వారు ప్రవేశపెట్టుకునేటట్లు శిక్షణ ఇవ్వవలసి వస్తుంది. దాంతో నిదానంగా వారి మనసు మారుతుంది. బాధ లేకుండా అంగప్రవేశం జరుగుతుందేనే విశ్వాసం కలుగుతుంది.

వజినిస్‌మస్‌కి తెలీని భయం కారణం గనుక రిలాక్సేషన్‌ థెరపి ఎవరిమటుకు వారు ఎలా చేసుకోవాలో నేర్చుకుంటే దాన్ని ప్రాక్టీస్‌ చేయడం వల్ల మామూలుగా మారతారు. సెక్స్‌లో భయం తొలగిపోతుంది.
వజినిస్‌మస్‌ పరిస్థితిని ఎవరిమటుకు వారు తొలగించుకోవడానికి మరొకపద్ధతి ఉంది. వజినిస్‌మస్‌ ఉన్నవారు ఒంటరిగా ఒక గదిలో చేరి ఒంటిమీద ఉన్న బట్టలని పూర్తిగా తీసివేయాలి. నేలమీద ఒక పెద్దఅద్దం పెట్టి దానికి ఎదురుగా కూర్చోవాలి. ఆ అద్దంలో తమ యోనిని చూసుకోగలగాలి. ఆ తరువాత తన వేలుని యోని రంధ్రంలోకి నిదానంగా జొప్పించాలి.

కొద్దిరోజులు అలా చేసిన తర్వాత వ్రేలుని యోనిమార్గం లోపలికి పూర్తిగా పోనివ్వాలి. అలా దశల వారిగా చేయడంతో భయం, సంకోచం తొలగి ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.
ఒక వ్రేలుని పూర్తిగా జొప్పించగలిగిన తరువాత రెండు వ్రేళ్ళని పూర్తిగా జొప్పించడానికి ప్రయత్నం చేయాలి. ఇలా వ్రేళ్ళని యోనిమార్గంలోకి పోనివ్వడానికి నూనెగాని, వేజలైన్‌గాని, జైలోకైన్‌ జెల్లీగాని, కె.వై. జెల్లీగాని ఉపయోగించవచ్చు.

వ్రేళ్లని యోనిమార్గంలోకి పోనిస్తున్నప్పుడు అద్దంలో స్పష్టంగా చూడాలి. దాంతో తమ యోని చిన్నదికాదని, పెద్దదేనని ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. అలా కొంతకాలం యోని లోకి వేళ్ళని పోనిచ్చి ప్రాక్టీసు చేసిన తరువాత డాక్టర్‌ చెప్పినట్లు వెడల్పుగా ఉండే డైలేటార్స్‌ని యోనిలోకి జొప్పించాలి.
ఈ రకంగా వజినిస్‌మస్‌ ఉన్నవారిలో తమ మీద తమకి నమ్మకం కలిగించాలి. దాంతో వారిలో జంకు, భయం తొలగిపోతాయి. ఆపైన భర్త ఆమె ఎడల ఆప్యాయంగా ఉంటూ స్టెప్‌ బై స్టెప్‌ సంయోగంలో పాల్గొనాలి.

వజినిస్‌మస్‌ని ప్రేమతో చక్కదిద్దవలసిందే తప్ప ఫోర్సుతో చక్కదిద్దేది కాదు. ఇందుకు భర్త సహనం, సహకారం అవసరం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top