నేను డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాను. నల్లగా ఉంటాను, అందవికారంగా మాత్రం కాదు. నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే నువ్వు బావుండవని నా ముఖం మీదే చెప్పింది. చనిపోవాలన్నంత బాధ కలిగింది. నల్లగా ఉండేవాళ్లు ప్రేమకు అనర్హులా? వారికి ప్రేమించే హక్కులేదా? అన్నింటిలోనూ మంచి నిర్ణయం తీసుకునే అమ్మాయిలు రంగుచూసి మా పట్ల ఎందుకిలా ప్రవర్తిస్తారు. మాకూ మనసుంటుందని, ప్రేమ మనసుకు సంబంధించిన విషయమని ఎందుకు అర్థం చేసుకోరు? దయచేసి నా బాధను అర్థం చేసుకుని సరైన సమాధానం ఇచ్చి మమ్మల్ని ప్రేమించేలా కొంతమందినైనా మారుస్తారని ఆశిస్తున్నాను.నీ బాధను నేను అర్థం చేసు కోగలను. అయితే ఒక్క అమ్మాయి మిమ్మల్ని కాదన్నంత మాత్రాన ఇక ప్రపంచంలో అమ్మాయి లందరూ నల్లగా ఉండేవారిని ప్రేమించరనే సందేహా ల నుంచి బయటకు రండి. సాధారణంగా మనకు ఎదురైన అనుభవాలను మనం మూడు రకాలుగా ఫిల్టర్ చేస్తాం. అవి డిలీషన్, డిస్టార్షన్, జనరలైజేషన్. ఇప్పటివరకు మీతో చాలామంది స్నేహం చేసి ఉంటారు. వారికి మీ రంగు అడ్డుకాలేదే. కాని మీరా విషయాన్ని మనసునుంచి డిలీట్ చేశారు. మీకు ఎదురైన ఒక అనుభవాన్ని ‘జనరలైజ్’ చేసి అదే నిజమని నమ్ముతున్నారు. దాన్నుంచి బయటకు రండి. నల్లగా ఉన్నవారిని కూడా కోరి వరించిన అమ్మాయిలు ఎందరో ఉన్నారు ఈ లోకంలో. తెలుగు సినిమా కామెడీయన్ బాబూమోహన్ గారిది లవ్ మ్యారేజ్ అనే విషయం మీకు తెలుసా?