వైరస్‌ల కారణంగా వచ్చే ఈ వ్యాధులను అదుపులో పెట్టేందుకైతే మందులున్నాయి గానీ.. వీటిని శరీరం నుంచి పూర్తిగా నిర్మూలించి, సంపూర్ణంగా నయం చేయటం కష్టం. హెర్పిస్
ఇది హెర్పిస్ సింప్లెక్స్ టైప్-2 అనే వైరస్ మూలంగా వస్తుంది. దీని బారినపడ్డ వారితో సెక్స్‌లో పాల్గొంటే.. 2-7 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ముందుగా పురుషాంగం మీద, స్త్రీ జననావయాల మీద నీటి పొక్కుల్లాంటివి వస్తాయి. తర్వాత ఇవి చితికి పుండ్లు పడతాయి. చికిత్స తీసుకుంటే అప్పటికి తగ్గినప్పటికీ.. ఒంట్లో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడల్లా ఈ పొక్కులు మళ్లీ మళ్లీ వస్తుండటం గమనార్హం. హెర్పిస్‌కు సకాలంలో చికిత్స తీసుకోకపోతే వైరస్ శరీరంలోని ఇతర భాగాలకూ వ్యాపిస్తుంది. దీంతో మెదడు పొరల వాపు, నడుము వద్ద నాడులు దెబ్బతినటం, పురుషుల్లో నంపుసకత్వం కూడా రావొచ్చు. గర్భిణులకైతే అబార్షన్ ముప్పూ పెరుగుతుంది. ఇది తల్లి ద్వారా బిడ్డకు సంక్రమించి రకరకాల సమస్యలు తెచ్చిపెడుతుంది.
జననాంగాలపై పులిపిర్లు
వీటినే 'వైరల్ వార్ట్స్' అంటారు. ఇవి హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) కారణంగా వస్తాయి. సెక్స్‌లో పాల్గొన్న ఐదారు నెలల్లో జననావయాలపై పులిపిర్లు వస్తాయి. రోగనిరోధకశక్తి తక్కువగా గలవారిలో నెల లోపే బయటపడొచ్చు. దీనివల్ల రకరకాల బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు తేలికగా వస్తాయి కూడా. సమస్య తీవ్రమైతే మూత్రం నిలిచిపోవచ్చు. కొన్నిరకాల పులిపిర్లు మూత్ర మార్గంలోనూ పెరుగుతాయి. వీటితో జననావయాల్లో క్యాన్సర్ల ముప్పూ ఎక్కువ అవుతుంది. స్త్రీలల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లలో దాదాపు 40% వీటి మూలంగా వచ్చేవే.
హెచ్‌ఐవీ
ఎయిడ్స్ కారక హెచ్‌ఐవీ ముఖ్యంగా సెక్స్ ద్వారానే సంక్రమిస్తుంది. పరీక్షల్లో వైరస్ సోకినట్టు బయటపడినా కొన్ని సంవత్సరాల వరకూ పైకి ఎలాంటి లక్షణాలూ కనబడకపోవచ్చు. దీనివల్ల ఒంట్లో రోగనిరోధక శక్తి వేగంగా తగ్గిపోయి రకరకాల జబ్బులు, ఇన్‌ఫెక్షన్లు చుట్టుముడతాయి.
హెపటైటిస్-బి
సెక్స్‌తో పాటు ఇతరత్రా మార్గాల్లోనూ ఈ వైరస్ వ్యాపిస్తుంది. పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. కానీ దీర్ఘకాలంలో కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా కామెర్లు, లివర్ గట్టిపడటం, లివర్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలు చుట్టుముడతాయి.
మొలస్కం కంటేజియాజం
ఇది 'పాక్స్ వైరస్' ద్వారా సంక్రమిస్తుంది. దీనిలో అంగం మీద మధ్యలో ఉబ్బెత్తుగా ఉండి, ముత్యపు రంగులో మొటిమల్లాంటి పొక్కులు వస్తాయి. ఇది అంత ప్రమాదకరమైంది కాకపోయినా బాగా ఇబ్బంది పెడుతుంది.
బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు
సమర్థవంతమైన యాంటీబయాటిక్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లను నయం చేసే అవకాశమైతే ఉంది గానీ.. ఇవి బాగా ముదిరితే ఇతరత్రా చాలా దుష్ప్రభావాలు జీవితాంతం బాధించొచ్చు.
సిఫిలిస్
ట్రిపనోమా పాలిడమ్ అనే బ్యాక్టీరియా మూలంగా ఇది వస్తుంది. సెక్స్‌లో పాల్గొన్న తర్వాత 9-90 రోజుల్లో దీని లక్షణాలు ఆరంభమవుతాయి. ముందుగా అంగం మీద మచ్చలా వస్తుంది. తర్వాత పుండుగా మారుతుంది. నొప్పి ఉండదు. చికిత్స తీసుకోకపోయినా కొద్దిరోజులకు పుండు తగ్గిపోతుంది. రెండు మూడు నెలల తర్వాత రెండో దశలో ఒంటి మీద దద్దుర్లు వస్తాయి. దురద ఉండదు. కీళ్లనొప్పులు, నోటిలో పుండ్లు, కంజెక్టివైటిస్, తల వెంట్రుకలు రాలిపోవటం వంటి లక్షణాలు కనబడతాయి. కొందరిలో జ్వరం, కామెర్లు, లింఫ్ గ్రంథుల్లో వాపూ ఉండొచ్చు. చికిత్స తీసుకోకపోతే కొన్నేళ్ల తర్వాత ఒంటి మీదా, నాలుక పైనా, ఇంకా శరీరం లోపలి అవయవాలపైనా పెద్ద పెద్ద పుండ్లు పడొచ్చు. జబ్బు లోపల్లోపలే ముదిరిపోతే సిఫిలిస్ బారినపడ్డ పదేళ్లకు కొన్ని రకాల గుండెజబ్బులూ వస్తాయి.
గనోరియా
దీనికి మూలం నైసీరియా గనోరియా అనే బ్యాక్టీరియా. సెక్స్‌లో పాల్గొన్న 2-5 రోజుల్లో దీని లక్షణాలు కనిపిస్తాయి. మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి, మూత్ర మార్గం నుంచి చీము, స్త్రీలల్లో తెల్లమైల వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొద్దిరోజుల తర్వాత మూత్రం నిలిచిపోవటం, మూత్రమార్గం సన్నబడి కుంచించుకుపోవటం, మూత్ర మార్గానికి రంధ్రం పడి దానిలోంచి మూత్ర విసర్జన కావటం వంటి సమస్యలు ముంచుకొస్తాయి. అంతేకాదు.. పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలల్లో పెలోపియన్ ట్యూబులు మూసుకుపోవటం లాంటి సమస్యలూ రావొచ్చు. ఈ బ్యాక్టీరియా కీళ్లు, గుండె, కళ్ల వంటి భాగాలకూ చేరితే రకరకాల సమస్యలు మొదలవుతాయి. స్త్రీలల్లో పొత్తికడుపు నొప్పి, తెల్లమైల అధికం కావటం, నెలసరి క్రమం తప్పిపోవటం, నడుము నొప్పి లాంటి సమస్యలు కూడా వస్తాయి.
ఖాంక్రాయిడ్
హీమోఫిలస్ డుక్రియీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సెక్స్‌లో పాల్గొన్న 2-7 రోజుల్లో జననావయావల మీద ఎక్కువ సంఖ్యలో పుండ్లు పడతాయి. నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. గజ్జల్లో బిళ్ల కట్టినట్టు వాపు కనిపిస్తుంది. పురుషాంగం మీది చర్మం కదలికలు బిగుసుకుపోతాయి. మూత్ర విసర్జన కూడా ఇబ్బందిగా ఉంటుంది.
క్యాండిడియాసిస్
ఇది ఫంగస్ కారణంగా వచ్చే సమస్య. దీన్ని పూర్తిగా నయం చెయ్యొచ్చు. ప్రధానంగా 'క్యాండిడా అల్బికాన్స్' అనే సూక్ష్మజీవి మూలంగా వస్తుంది. జననాంగాలపై పూత రావటం దీని లక్షణం. పురుషుల్లో అంగంపై ఎర్రటి పూత, స్త్రీలల్లో పెరుగులా చిక్కగా తెల్ల మైల అవుతుంటుంది. బయటి సంబంధాలు లేకున్నా భార్యాభర్తల్లో కూడా ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించొచ్చు.
ట్రైకోమొనియాసిస్
ఇది ట్రైకోమొనాస్ వజైనాలిస్ అనే సూక్ష్మక్రిమి వల్ల వస్తుంది. ఇది సంక్రమిస్తే పురుషులకు అంగంలో ఏదో చెప్పలేని అసౌకర్యం (టింగ్లింగ్ సెన్సేషన్) కలుగుతుంది. స్త్రీలల్లో తెల్లమైల, యోనిలో మంట, దురద వంటివి కనబడతాయి. ఇది భార్యాభర్తల్లో ఒకరి నుంచి మరొకరికీ సంక్రమిస్తుంది కూడా.
సుఖ వ్యాదుల పై అవగాహనా సుఖ వ్యాధులనివారణ మార్గాలు